ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తాయి మరియు అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు:
"గురువుగారు, ధ్యానం చేసేటప్పుడు కొద్దిసేపు దృష్టి పెడుతున్నాను. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి. మనసును కేంద్రీకరించినప్పుడు కొద్దిగా ఆలోచనలు తగ్గుతున్నాయి. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి. ఎప్పుడు నాకు ఆలోచనలు పోతాయి, ఆలోచనా రహిత స్థితి ఎప్పుడు వస్తుంది, ధ్యాన స్థితి ఎప్పుడు వస్తుంది, సమాధి ఎప్పుడు వస్తుంది? నేను బ్రహ్మ జ్ఞానం ఎప్పుడు పొందుతాను, ఆత్మ జ్ఞానిని ఎప్పుడు అవుతాను, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది భగవంతుడిని ఎప్పుడు అర్ధం చేసుకుంటాను. ఇదంతా కల్ల అనిపిస్తుంది గురువుగారు. దానికి బదులు మందు తాగి పడుకుంటే సమాధి కంటే ఎక్కువ ఉంటుంది గురువు గారు. నేను 30 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను కానీ కనీసం 30 సెకన్లు కూడా ఆలోచనలను ఆపలేకపోతున్నాను."
అప్పుడు నేను అతనిని అడిగాను, "ఎలా ధ్యానం చేస్తున్నావు?"
"నాకు పెళ్ళి కాలేదు. నేను ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తరువాత ధ్యానం చేస్తాను, పుస్తకాలు చదువుతాను అంతే, ఇదే నా జీవనశైలి గురువుగారు, 30 సంవత్సరాల నుండి నేను ఇదే చేస్తున్నాను గురువు గారు. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు గురువుగారు," అన్నాడు.
"నేను అతనిని ఎప్పుడైనా సేవ చేసావా అని అడిగాను. సేవ అంటే సమయం వృధా గురువుగారు అదేదో ధ్యానంకు కేటాయిస్తే అయిపోతుంది కదా," అన్నాడు.
"నేను అతనిని ఎప్పుడైనా దానం చేసావా అని అడిగాను. దానం చేస్తే డబ్బు వృధా గురువుగారు అదేదో పుస్తకం కొనుక్కొని చదివితే జ్ఞానం వస్తుంది, దానం చేస్తే ఏమి వస్తుంది గురువుగారు ఏమీ రాదు," అన్నాడు.
"మరి ఇవన్నీ చేయకుండా ధ్యానం ఎలా కుదురుతుంది? పెళ్ళి చేసుకోకుండా, సంసారం చేయకుండా పిల్లల్ని కనాలంటే ఎలా? ఒక బాధ్యత, బరువు తీసుకోని వాడికి దాని స్థితిని అనుభవించే యోగ్యత రాదు, దాని యోగ్యత ను పొందే అర్హత కూడా రాదు. నువ్వు సేవ, దానం చేయనప్పుడు ధ్యానం కుదరదు. నువ్వు సేవ చేస్తేనే నీ మనసు శుద్ధి అవుతుంది, నువ్వు దానం చేసినప్పుడు హృదయం శుద్ధి అవుతుంది. ఆ రెండూ చేసినప్పుడే నీ ఆత్మ నీకు అందుబాటులోకి వస్తుంది, అనుభూతి లోకి వస్తుంది, నీకు దర్శనము లోకి వస్తుంది. అప్పుడు ధ్యానంలో కూర్చోగానే కుదురుతుంది."
"డబ్బు ఇస్తే భగవంతుడు ఆలోచనలు ఆపేస్తాడా? అలా ఏమన్నా ఉంటే చెప్పండి గురువు గారు మొత్తం ఆయనకే ఇచ్చేస్తా, ఒక్క ఆలోచన కూడా రాకుండా చూడమని చెప్పండి," అన్నాడు.
"ఒరేయ్ మూర్ఖుడా, డబ్బులు ఇస్తే పరమాత్మ ఆలోచనలు రాకుండా చేయడం అలా ఏమీ ఉండదు. నువ్వు ధనమును దానం చేసినప్పుడు నీ హృదయం శుద్ధి అవుతుంది. దానగుణం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇక్కడ గుణం ముఖ్యం, డబ్బు కాదు. నువ్వు రూపాయి ఇచ్చావా, పది రూపాయలు ఇచ్చావా అనేది కాదు. ఎంత ఇవ్వాల్సిన శక్తి ఉంది, ఎంత ఇస్తున్నావు అనేది పాయింట్. నీకు వంద రూపాయలు ఇచ్చే శక్తి ఉంటే వంద రూపాయలు ఇచ్చేయి. నీకు రూపాయి ఇచ్చే శక్తి ఉంటే రూపాయి ఇచ్చేయి. నీకు ఇచ్చే శక్తి ఎంత ఉంటే అంత ఇచ్చేయి. ఎవరైతే ఆ శక్తిని పాటిస్తారో వారికి హృదయం శుద్ధి అవుతుంది. దానం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. సేవ మనసును శుద్ధి చేస్తుంది, ధ్యానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. మనకు మూడు కర్మలు ఉంటాయి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలతో కూడుకున్న ఈ పాంచ భౌతిక శరీరం ధ్యానం చేయడం వల్ల ఒక్క సెకనులో శుద్ధి అవుతుంది. ధ్యానం అనేది ప్రక్షాళనమే. దీనికి పరమాత్మ బాధ్యత వహించడు. ధ్యానం చేయడం అనేది నీ బాధ్యతనే. నీవు ధ్యానం చేసినప్పుడు దేహం ప్రక్షాళన అవుతుంది."
మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం
మీ భక్తిని మరింతగా పెంచుకోవడానికి ఆధ్యాత్మిక విషయాలపై మరిన్ని కథనాలను కనుగొనడానికి, మాని తనిఖీ చేయమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఉపన్యాసాలు.
బాహ్య సూచనలు
మరింత దైవిక కంటెంట్‌ని కనుగొనడానికి, మీరు సందర్శించవచ్చు shreeprabhu వెబ్సైట్