మన జీవితంలో కష్టాలు
మన అందరి జీవితంలో కష్టాలు, దుఃఖాలు, బాధలు సర్వ సాధారణం. అవి ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలో మహాగురు వారి మాటలలో తెలుసుకుందాము.
కష్టాల మూల కారణం
ఏదైతే అనువు కాదో అది నువ్వు చేయాలనుకుంటావు అప్పుడు కష్టాలు మొదలవుతుంటాయి. నువ్వు కష్టపడుతున్నావంటే తప్పుడు స్థితిలో, తప్పుడు స్థానంలో, తప్పుడు స్థాయిలో, తప్పుడుగా ప్రయాణం చేస్తున్నావని అర్థం. నువ్వు తప్పుడు పరిస్థితిలో ఉన్నావని అర్థం, ఒక తప్పుడు మార్గంలో ఉన్నావని అర్థం.
తప్పుడు పద్ధతులు, నమ్మకాలు, ఆచరణలు
నీ జీవితంలో వచ్చే దుఃఖం, బాధ, భయం, నష్టం, కష్టం, దరిద్రం, దురదృష్టం, చెడు అంతా నీవు తప్పుడు పద్ధతులు ఆచరిస్తే, తప్పుడు నమ్మకాలను కలిగిఉంటే, తప్పుడు ఆచరణలో ఉంటే, తప్పుడు పనులు చేస్తే, తప్పుడు ప్రయత్నాలు చేస్తే అప్పుడు తప్పుడు పరిస్థితికి వస్తావు.
సానుకూల మార్పు తీసుకొచ్చే విధానం
తప్పుగా ఉండకుండా ఆలోచించు, కొద్దిగా కొత్తగా ఆలోచించు, మెదడుకు పదును పెట్టు. ఇంతకన్నా గొప్పగా చేయలేనా, ఇంతకంటే గొప్పగా మాట్లాడలేనా, ఇంతకంటే గొప్పగా నేను ఆలోచించలేనా, ఇంతకంటే గొప్పగా నేను ఉండలేనా అని ఒక ప్రశ్న వేసుకో.
రోజువారీ ఆత్మపరిశీలన
రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి కూర్చోని ఉదయం నుండి రాత్రి వరకు ఏం చేసాను అని చూసుకున్నారా? అలా చూసుకుంటే నీ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయవు. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉంటావు. పడుకునేటప్పుడు 24 గంటలు గడిపావు కదా 24 నిమిషాలు కూర్చోని ఒకసారి ఆలోచించుకో ఉదయం నుండి సాయంత్రం దాకా ఎలా మాట్లాడాను, ఎలా ఆలోచించాను, ఎలా చేసాను, ఎలా ఉన్నావు.
నీకు నువ్వే వేసుకునే ప్రశ్నలు
ఇంతకంటే ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే మంచిగా, ఇంతకంటే ఉన్నతంగా, ఇంతకంటే ఉత్తమంగా, ఇంతకంటే ఎక్కువ విలువగా, ఇంతకంటే ఎక్కువ గౌరవంగా, ఇంకా ఎక్కువ ఫలంగా నేను ఉండలేనా, నేను చేయలేనా, నేను జీవించలేనా అనే ప్రశ్న వేసుకో. ఇంతకంటే నేను బాగా ఉండగలుగుతాను అని నీకు అనిపించినప్పుడు ఆరోజు నువ్వు ఓడిపోయావు.
వ్యక్తిగత అభివృద్ధి సాధన
నిన్నటి కంటే శాంతిగా ఉన్నానా, నిన్నటి కంటే ఎక్కువ తృప్తిగా ఉన్నానా లేదా, నిన్నటి కంటే ఎక్కువ ఆనందంగా గడిపానా లేదా, నిన్నటి కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నానా లేదా, నిన్నటి కంటే ఎక్కువ అర్థం చేసుకున్నానా లేదా, నిన్నటికంటే ఎక్కువ తెలుసుకున్నానా లేదా, నిన్నటి కంటే ఎక్కువగా పదిమందికి మంచి చేసానా లేదా, నిన్నటి కంటే ఎక్కువగా ఈరోజు నేను నా జీవితంలో ఎదిగానా లేదా అని చూసుకోవాలి. నువ్వు రోజూ అలా చూసుకుంటే మూడు నెలల్లో ముత్యంలా తయారవుతావు. నిన్నటిరోజును ఈరోజు కంపేర్ చేసుకోకపోతే మొన్నలాగా తయారవుతావు. మొన్న ఎలా ఉన్నావో అలా అవుతావు.